స్వాతంత్య్రం తెచ్చామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికీ చంకలు గుద్దుకుంటుంటారు. స్వాతంత్య్ర పోరాటంలో తామే పాల్గొన్నామన్న భావన వ్యాప్తి చేయడం ద్వారా రాజకీయ లబ్ది పొందాలనుకుంటారు. నిజానికి ఎందరో మహానుభావులు ఉద్యమించారు. లక్షల మంది అసువులు బాసారు. అన్నింటికి మించి కాంగ్రెస్ చేసిన దుర్మార్గం కారణంగా దేశం రెండు ముక్కలయ్యింది. లక్షలాది మంది శవాల విూద జెండా ఎగరేశారు. ఓ రకంగా ఆగస్ట్ 14 , 1947 కాళరాత్రి అని చెప్పకతప్పదు. 1947 ఆగస్టు 14 ఉదయం. ఒకవైపు కరాచీలో పాక్ అనే కొత్త దేశం పురుడుపోసుకుంటోందన్న సంబరాలు, మరోవైపు డిల్లీలో దశాబ్దాల పారతంత్రం వీడి స్వాతంత్య్రపు వెలుగులు విరజిమ్మబోతున్నాయన్న సంబరం..కానీ, పంజాబ్, బెంగాల్‌లలోని లక్షలాది ఇళ్లలో మాత్రం హర్షాతిరేకాలు లేవు.. కేవలం కంటివిూద కునుకు లేని భయం, గుండెల్ని పిండేసే అనిశ్చితి మాత్రమే అక్కడి ప్రజల్లో కనిపించింది. దానికి కారణం తెల్లారితే తమ ఊరు, తమ ఇల్లు ఏ దేశంలో ఉంటాయో అక్కడ ఎవరికీ తెలియని దుర్భరమైన పరిస్థితి. సరిహద్దులను నిర్ణయించే బాధ్యతను బ్రిటీష్ న్యాయవాది జాన్ రెడ్‌క్లిఫ్‌కు అప్పగించినప్పటికీ, ఆయన గీసిన ఆ వినాశకరమైన గీత ఆగస్టు 14న బయటకు రాలేదు. ఆ తుది నిర్ణయాన్ని ఆగస్టు 17 వరకు దాచిపెట్టారు. అంటే అర్ధరాత్రి రెండు దేశాలు స్వతంత్రంగా మారినప్పటికీ, వేలాది కుటుంబాలకు తమ సొంత ఇల్లు భారత్‌లో ఉందో, పాకిస్థాన్‌లో ఉందో తెలియని ఒక విచిత్రమైన, విషాదకరమైన పరిస్థితిలో7 ఉండిపోయారు. విభజన ప్రకటన ఇరు ప్రాంతాల ప్రజల్లో తీవ్ర ఆవేదన, ఆందోళన నింపింది. అందుకే ఆగస్టు 14 భారత దేశానికి ఒక చీకటి రోజుగా పరిగణిస్తారు. ఇది స్వాతంత్య్రం తీసుకుని వచ్చిన దానికన్నా పెను విషాదాన్ని నింపింది. ఒక రకంగా చెప్పాలంటే 1947 ఆగస్టు 14 రాత్రి కేవలం భారత్‌ను చీల్చడానికి ఉద్దేశించిన రోజుగానే చూడాలి. దేశాలను విభజించడానికి గీసిన గీతకు ఆనాటి పెద్దలు అంగీకారం తెలపడం నేటికీ జీర్ణించుకోలేని చరిత్రగా మిగిపోతుంది. విభజనకు గీసిన ఒక గీత మధ్య అసలు మనిషి ఎక్కడ నిలబడ్డాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలి పోయింది. ఈ చారిత్రక ఘట్టాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆగస్టు 14న కరాచీలో ఏం జరిగిందో చూడాలి. ఆ రోజు ఉదయం 9 గంటలకు సింధ్ అసెంబ్లీ భవనం బయట ఉత్సాహంతో జనం కిక్కిరిసిపోయారు. మహమ్మద్ అలీ జిన్నా, లార్డ్ మౌంట్‌బాటన్ ఒకే రాచరికపు బగ్గీలో అక్కడికి చేరుకున్నారు. కరాచీలోని రాజ్యాంగ పరిషత్ ప్రత్యేక సమావేశంలో అధికార మార్పిడి పక్రియ అధికారికంగా ముగిసింది. అయితే, మౌంట్‌బాటన్‌కు అక్కడ ఎక్కువ సేపు గడిపే వ్యవధి లేదు. మధ్యాహ్నం 2 గంటలకే ఆయన డిల్లీకి పయనమయ్యారు. ఎందుకంటే అదే రోజు అర్ధరాత్రి భారత్ స్వాతంత్య వేడుకల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఇక, కరాచీలో సంబరాలు ముగిసి డిల్లీలో అర్ధరాత్రి వేడుకలకు వేదిక సిద్ధమవుతుంటే, పంజాబ్‌లో మాత్రం సరిహద్దు రక్తసిక్తమయ్యింది. విభజన వార్త కేవలం పత్రికలకే పరిమితం కాకుండా ప్రజల గుమ్మాల ముందుకు వచ్చింది. హిందువులు, ముస్లింలు, సిక్కులు తమ ఇళ్లను వదిలి వెళ్లాలో వద్దో తెలియక కొట్టుమిట్టాడారు. పంజాబ్‌లో రైళ్లు నడుస్తున్నాయి, కానీ అవి కేవలం ప్రయాణికులను మాత్రమే కాక, ముక్కలైన జీవితాలను మోసుకెళ్తున్నాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 8 మధ్య దాదాపు ఏడు లక్షల మంది శరణార్థులు రైళ్ల ద్వారా సరిహద్దులు దాటారని అంచనా. కానీ, అసలు భయానక దృశ్యం ఆగస్టు 17 తర్వాత మొదలైంది. రెడ్‌క్లిఫ్ లైన్ బహిర్గతమయ్యాక, తమ ఊరు పరాయి దేశంలోకి వెళ్లిపోయిందని తెలిసిన దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు కాలినడకన, బస్సుల్లో, రైళ్లలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని సరిహద్దులు దాటడం ప్రారంభించారు. మార్గమధ్యంలో శరణార్థుల కాఫిలాలు, రైళ్లపై దాడులు జరిగాయి.
దహనమైన, నిశ్శబ్దంగా శవాల దిబ్బగా మారిన రైళ్లు స్టేషన్లకు చేరుకున్నాయి. ఈ హింసలో 5 నుంచి 10 లక్షల మంది లేదా కొన్ని అంచనాల ప్రకారం 15 నుంచి 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 75 వేల మంది మహిళలు కిడ్నాప్‌లు, లైంగిక హింసకు గురయ్యారు. దేశమంతా ఒకవైపు పండుగ వాతావరణం, మరోవైపు రక్తపాతంతో అల్లకల్లోలంగా ఉంటే, మహాత్మా గాంధీ మాత్రం ఈ వేడుకలకు చాలా దూరంగా కలకత్తాలోని బెలియాఘాటాలో ఉన్న హైదరీ మంజిల్‌లో ఉన్నారు. కలకత్తాలో ఆగస్టు 16–18 మధ్య జరిగిన హింసలో 4,000 మందికి పైగా చనిపోయిన వేళ, గాంధీ అక్కడే ఉండి శాంతి కోసం నిరాహార దీక్షలు చేపట్టారు. బ్రిటిష్ పాలన అధికారికంగా అంతమై, కొత్త పతాకం ఎగిరింది. కానీ, ఆ వెలుగుల వెనుక దట్టమైన చీకటి దాగి ఉంది. ఒకవైపు అధికార మార్పిడి, మరోవైపు కోట్ల మంది నిరాశ్రయుల కాళ్ల నడకలు..శాల దిబ్బలు వంటివన్నీ కళ్లముందు కదలాడాయి. జిన్నా ఎత్తులకు లొంగిపోవడంతో దేశం భారీ మూల్యం చెల్లించుకుంది. గాంధీ, నెహ్రూలు ప్రేక్షకపాత్ర వహించారు. మారణహోమాన్ని ఆపలేక పోయారు. ప్రజలను నడివీధుల్లో నిరాశ్రయులను చేశారు. ఇప్పటికీ అనేక కుటుంబాలు ఆ క్షోభ నుంచి కోలుకోలేదు. స్వాతంత్య్రం తెచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న నేటి కాంగ్రెస్ నేతలు ఆనాటి మారణహోమానికి సమాధానం చెప్పగలరా? ఈ విభజన కేవలం కాంగ్రెస్ లొంగుబాటు తీరు వల్లే అని ప్రపంచానికి తెలియదా? దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో విఫలమైన ఆనాటి కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏమనాలి? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉన్నాయి.

Leave a Reply