IndianMedia.net

Inspiring India, Enlightening Minds

Bangladesh: భారత్‌తో స్నేహం వద్దనుకుంటోందా.? తీస్తాపై బంగ్లాదేశ్ తీరు..

Bangladesh Teesta Project China India Water Dispute
Bangladesh Teesta Project China India Water Dispute

Bangladesh:  తీస్తా నదీ వివాదం భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల్ని పెంచుతోంది. చైనా సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. అయితే, ఈ విషయంలో భారత్‌తో స్నేహాన్ని బంగ్లాదేశ్ పణంగా పెట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ వివాదంపై బంగ్లా జలవనరుల శాఖ మంత్రి షాహిదుద్దీన్ చౌదరి మాట్లాడుతూ.. భారత్‌తో సంబంధాలను దెబ్బతీయాలని ఢాకా కోరుకోవడం లేదని, అయితే నదీ జలాల విషయంలో బంగ్లాదేశ్ ప్రయోజనాలను కూడా భారత్ పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ఢాకాలో జరిగిన సెమినార్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అవసరాలు ఉన్నట్లే బంగ్లాదేశ్‌కు కూడా ఉన్నాయని అన్నారు. ఈ విషయాన్ని ఒక మిత్రదేశం, మరో మిత్రదేశం ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

తీస్తా నది భారత్‌లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి చేరుతుంది. ఉత్తర బంగ్లాదేశ్ వ్యవసాయం, సాగునీరు, ప్రజల జీవనోపాధికి ఈ నది అత్యంత కీలకం. ఇదే సమయంలో బెంగాల్‌లో సాగునీరు, ఇతర అవసరాలకు కూడా తీస్తానది కీలకమైన వనరుగా ఉంది.

చైనాతో బంగ్లాదేశ్ మైత్రి:

తీస్తా నదికి సంబంధించి మగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టును చైనా సహకారంతో చేపట్టేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా వరదలు, నదీ కోత, వేసవిలో నీటి కొరత వంటి సమస్యలను పరిష్కరించాలని ఢాకా భావిస్తోంది. ఉత్తర బంగ్లాదేశ్‌లోని ఐదారు జిల్లాలు ఈ నదిపై భారీ ఆశలు పెట్టుకున్నాయని మంత్రి షాహిదుద్దీన్ అన్నారు. నదీ కోత, వరదలు, నీటి సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ఇది ఎంతో అవసరమని ఆయన చెప్పారు.

అసలు వివాదం ఏంటి..?

తీస్తా నది జలాల పంపిణీ విషయంలో భారత్, బంగ్లా మధ్య దశాబ్ధాలుగా వివాదం ఉంది. 1983లో కుదిరిన మధ్యంతర ఒప్పందం ప్రకారం తీస్తా జలాల్లో 39 శాతం భారత్‌కు, 36 శాతం బంగ్లాదేశ్‌కు కేటాయించాలని ప్రతిపాదించారు. మిగిలిన 25 శాతం నీటిని పంచుకోకుండా ఉంచాలని నిర్ణయించారు. 2011లో కొత్త మధ్యంతర ఒప్పందానికి రెండు దేశాలు ముందుకొచ్చినా, పశ్చిమ బెంగాల్ అభ్యంతరాలతో అది కుదరలేదు. జూన్ నెలలో బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహ్మాన్ చైనా పర్యటనకు వెళ్లారు. తీస్తా ప్రాజెక్టుపై సాంకేతిక అధ్యయనం వేగవంతం చేయాలని చైనా నాయకత్వంలో చర్చించారు.